మీనార్ (ఆంగ్లం : Minaret) (అరబ్బీమనారా (లైట్ హౌస్) منارة, కాని సాధారణంగా مئذنة) ఇస్లామీయ నిర్మాణ శైలుల మస్జిద్ ల విభాగాలు. ఈ మీనార్లు, మస్జిద్ యొక్క గుంబద్ లేదా డూమ్ తో బాటు నిర్మించబడుతాయి. ఈ మీనార్లు ఎత్తైనవిగా, నిటారుగా, నిలకడగా, దూరంనుండి వీక్షించగలిగే నిర్మాణాలుగా వుంటాయి.
మీనార్ అనే పదానికి మూలం అరబ్బీ పదం 'నూర్', నూర్ అనగా 'కాంతి' లేక 'జ్యోతి', అల్లాహ్ భక్తులపై తన నూర్ ను విరజిమ్ముతాడని, నమ్మకంతో వీటికి మీనార్ అనే పేరు పెట్టి, అల్లాహ్ యొక్క నూర్ ను స్వాగతించడానికి గల ఏర్పాటని భావిస్తారు.
దూరంనుండి మస్జిద్ గల ప్రదేశాన్ని సులభంగా కనుగొనుటకు.
ఇవి 'వాచ్ టవర్'లు లేదా "వీక్షణా బురుజులు" గానూ ఉపయోగపడేవి.
సమకాలీనంలో అజాన్ ఇచ్చి భక్తులకు నమాజ్ కొరకు పిలిచేందుకు, లౌడ్ స్పీకర్లు వుంచేందుకు ఉపయోగం. దూరంవరకూ గల భక్తులకు ఈ అజాన్ వాణి వినిపించేందుకు సులభం.
మస్జిద్ లో గల డూమ్, మీనార్ ల ద్వారా సహజసిద్ధమైన వెంటిలేషన్ కలుగజేయుటకు ఉపయోగం.
ఈ మీనార్ లను, స్వర్గద్వారాలుగా అభివర్ణిస్తారు. ఈ మీనార్లు, అలీఫ్ ఆకారంలో వుంటాయి, అలీఫ్ తోనే అల్లాహ్ పేరు మొదలవుతుంది,, భాష, పరిభాష, విద్య, విజ్ఞానం, ఈ అలీఫ్ తోనే ఆరంభమవుతుంది గనుక, ఈ విషయాలకు ప్రతీకగా మీనార్ ను భావిస్తారు.
ఇరాన్ లోని టెహ్రాన్ నగరంలో నిర్మాణ దశలో వున్న రెండు మీనార్ల పొడవు 230 మీటర్లు.
నిర్మాణం
మీనార్ల నిర్మాణం మూడు దశలపై ఆధారపడి వుంటుంది : బేస్ లేదా మూలం, స్తంభం, గేలరీ.
బేస్ : భూమిని త్రవ్వి మీనార్ యొక్క పునాదిని తయారు చేయడం.
స్తంభం : ఈ నిర్మాణమే అతిముఖ్యం. ఇది ఓ సిలెండర్, శంఖువు, లేదా స్తంభాకార నిర్మాణం. ఇది భూమిపై నిటారైన నిర్మాణం. భూమికి లంబంగా ఆకాశంవైపు చూస్తూ వుంటుంది.
గేలరీ : ఈ నిర్మాణం మీనార్ లోపలి నిర్మాణం. ఇందులో మెటుకల ద్వారా మీనార్ పైభాగానికి పోవడానికి మార్గముంటుంది. మీనార్ బయటి భాగంలో 'మిహ్రాబ్' లేదా కిటికీల ద్వారా బయటకు చూచుటకు అనువుగా నిర్మాణముంటుంది. మీనార్ అంతస్తుల ప్రకారం ప్రతి అంతస్తునకూ ఒక బురుజు లాంటి ఆకారం లేదా బాల్కనీ వుంటుంది. ఈ బురుజులు, నిలబడి బయటి ప్రదేశాన్ని వీక్షించుటకు అనువుగా నిర్మింపబడివుంటుంది.
ప్రాంతీయ శైలులు
ఇస్లామీయ నిర్మాణ శైలుల యందు మస్జిద్ ల తరువాత మీనార్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి పలు రకాలు, ప్రాదేశిక నిర్మాణ శైలుల ప్రభావంగా నిర్మింపబడుతాయి.